Nepal: నేపాల్ ప్రభుత్వ తీరుతో లక్షలాది రూపాయల పరిహారాన్ని కోల్పోబోతున్న విమాన ప్రమాద మృతుల కుటుంబాలు
- నేపాల్‌లో ఈ నెల 15న ఘోర విమాన ప్రమాదం
- ఐదుగురు భారతీయులు సహా 72 మంది మృతి
- చట్టంగా మారని ప్రతిపాదిత ‘ఎయిర్ క్యారియర్స్ లయబిలిటీ అండ్ ఇన్సూరెన్స్ డ్రాఫ్ట్ బిల్’
- నేపాల్‌లో 1955లో తొలి విమాన ప్రమాదం
నేపాల్‌లోని పోఖరాలో ఈ నెల 15న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. నేపాల్‌లో గత మూడు దశబ్దాల కాలంలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇదే. ఖఠ్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 72 మందితో బయలుదేరిన ఏటీఆర్-72 విమానం పోఖరా విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి 10 సెకన్ల ముందు కుప్పకూలింది.
బాధిత కుటుంబాలకు లక్షలాది రూపాయల పరిహారం అందాల్సి ఉండగా నేపాల్ ప్రభుత్వ తీరుతో అది అందే అవకాశం కనిపించకుండా పోయింది. కీలకమైన ఎయిర్ క్యారియర్ల బాధ్యత, బీమా ముసాయిదా బిల్లు చట్టంగా మారకపోవడమే ఇందుకు కారణం. ఇదే విషయాన్ని స్థానిక మీడియా కూడా తెలిపింది. మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ఆమోదించిన రెండేళ్ల తర్వాత 2020లో దేశీయ విమానయాన సంస్థలకు బాధ్యత వహించే వ్యవస్థకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.
దీని ప్రకారం ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, క్షతగాత్రులైనా సంబంధిత విమానయాన సంస్థ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రమాదంలో ఎవరైనా మరణించినా, లేదంటే గాయపడినా పరిహారాన్ని ఐదు రెట్లు పెంచాలని ‘ఎయిర్ క్యారియర్స్ లయబిలిటీ అండ్ ఇన్సూరెన్స్ డ్రాఫ్ట్ బిల్’లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రమాదంలో ప్రయాణికుడు చనిపోయినా, గాయపడినా కనీసం లక్ష డాలర్లను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం మాత్రం నేపాల్‌లో దేశీయ విమాన ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే 20 వేల డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారు.
ముసాయిదా బిల్లు ప్రకారం ప్రయాణికుడు, బాధిత కుటుంబాలకు కనుక తక్షణ ఆర్థిక సాయం అవసరమైతే ముందస్తు చెల్లింపు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రమాదం జరిగిన తర్వాత 60 రోజుల్లోపు విమాన సంస్థ కానీ, ఏజెంట్లు కానీ పరిహారం కోసం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది ఇంకా చట్టంగా రూపుదాల్చకపోవడంతో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు లక్షలాది రూపాయల పరిహారాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కాగా, నేపాల్‌లో 1955లో తొలి విమాన ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ ప్రమాదాల్లో 914 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో దేశీయ విమానాలు ఏడాదికి 4 మిలియన్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.