ChatGPT: గూగుల్ కు నిద్ర లేకుండా చేస్తున్న చాట్ జీపీటీ

Google losing sleep over ChatGPT starts working on its AI search engine and 21 new AI products
  • ఇది ఏఐ ఆధారిత సెర్చింగ్ టూల్
  • కావాల్సింది చెబితే సమస్త సమాచారం ముందుంచుతుంది
  • దీనికి ఆదరణ పెరుగుతుండడంతో గూగుల్ అప్రమత్తం
  • సొంత వెర్షన్ అభివృద్ధిపై దృష్టి
చాట్ జీపీటీ. కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాంకేతికత ఆధారంగా పనిచేసే చాట్ బాట్. ఇప్పుడు ఇది ఎంతో పాప్యులర్ అవుతుండడం.. ప్రపంచ టెక్నాలజీ, సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కు నిద్ర లేకుండా చేస్తోంది. చాట్ జీపీటీతో పోటీ పడేందుకు గూగుల్ తన శక్తియుక్తులను కూడదీసుకుంటోంది. 

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చాట్ జీపీటీ, ఏఐ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ నిపుణులే కాకుండా, గౌతమ్ అదానీ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం చాట్ జీపీటీని నోరారా ప్రశంసిస్తున్నారు. దీనిని వాడడం మొదలు పెట్టిన తర్వాత తనకూ కొంత వ్యసనంగా మారినట్టు గౌతమ్ అదానీ స్వయంగా లింక్డిన్ లో ప్రకటించారు. ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాట్ జీపీటీ సాయపడుతుందన్నారు. ఎలాంటి సమాచారం అయినా యూజర్ కు కావాల్సినట్టుగా చాట్ జీపీటీ అందిస్తుందని, మనుషులతో సంభాషిస్తుందని ఆయన రాసుకొచ్చారు.

చాట్ జీపీటీ అన్నది బ్రౌజర్ పై పనిచేసే టూల్. మనకు కావాల్సినది వాయిస్ ద్వారా చెబితే చాలు మొత్తం ఇంటర్నెట్ ను శోధించి కావాల్సింది మన ముందుంచుతుంది. ఓపెన్ ఏఐ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయగా, ఇందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు సైతం వాటాలున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. చాట్ జీపీటీ మరింత పాప్యులర్ అవుతుండడంతో గూగుల్ లో వణుకు మొదలైంది. దీంతో గూగుల్ సైతం తన సొంత ఏఐ సెర్చింజిన్ వెర్షన్ అభివృద్ధిపై అన్ని శక్తులను కేంద్రీకరించింది. చాట్ జీపీటీ మాదిరి ఏఐ ఆధారిత సెర్చింగ్ టూల్ తోపాటు, 21 నూతన ఉత్పత్తులను త్వరలో ప్రకటించనుంది.
ChatGPT
AI tool
searching
Google

More Telugu News