Anand Mahindra: అప్పట్లో నా ఆఫర్ కు సత్యం రామలింగరాజు నుంచి స్పందన రాలేదు: ఆనంద్ మహీంద్రా
- సత్యంలో టెక్ మహీంద్రాను విలీనం చేసేందుకు ప్రతిపాదించానన్న మహీంద్రా
- ఐఎస్బీ ఏర్పాటయినప్పుడు రాజుతో పరిచయం అయిందని వెల్లడి
- సత్యం, టెక్ మహీంద్రా కంపెనీలకు అప్పట్లో సారూప్యతలు ఉండేవని వ్యాఖ్య
మన దేశం ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారకులైన వ్యక్తుల్లో సత్యం రామలింగరాజు ఒకరు. ఆయన నాయకత్వంలో సత్యం కంప్యూటర్స్ ఎంతో ఉన్నతమైన ఎత్తుకు ఎదిగింది. అయితే సత్యం కంప్యూటర్స్ నుంచి మైటాస్ కు నిధులను తరలించడంతో ఆయన పతనం ప్రారంభమయింది. చివరకు సత్యం కంప్యూటర్స్ ను టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది.
మరోవైపు మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సత్యం కంప్యూటర్స్ సంక్షోభం బయటపడటానికి ఒక ఏడాది ముందే ఆ సంస్థలో తమ కంపెనీ టెక్ మహీంద్రాను విలీనం చేద్దామనుకున్నానని... దీనికి సంబంధించి రామలింగరాజుతో ప్రతిపాదన కూడా చేశానని తెలిపారు. అయితే ఆయన నుంచి తనకు స్పందన రాలేదని చెప్పారు. బహుశా సత్యం కంప్యూటర్స్ లో ఆర్థిక లొసుగులు ఉండటమే దానికి కారణం కావచ్చని అన్నారు.
హైదరాబాదులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటయినప్పుడు రామలింగరాజుతో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ రోజుల్లో టెక్ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్ బిజినెస్ మధ్య సారూప్యతలు ఉండేవని... అందుకే సత్యంలో తమ సంస్థను విలీనం చేయాలని భావించి ఆయనకు ఆఫర్ ఇచ్చానని చెప్పారు. రూ. 5 వేల కోట్ల విలువైన సత్యం స్కామ్ 2009లో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సత్యంను టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది.