fish: చేపలు తింటే కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టొచ్చట!

Eating oily fish twice a week might reduce the risk of kidney disease says scientists

  • వారానికి మూడుసార్లు తినాలంటున్న నిపుణులు
  • గుండె ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే నిర్ధారణ
  • న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
  • వివిధ దేశాలకు చెందిన 25 వేల మందిపై రీసెర్చ్

రోజువారీ ఆహారంలో చేపలను చేర్చడం ద్వారా పలు వ్యాధులను దూరం పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను పదిలంగా ఉంచుతాయని ఇప్పటికే పలు పరిశోధనలలో వెల్లడైంది. తాజాగా చేపలతో కిడ్నీ వ్యాధులకూ చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ తో సంయుక్తంగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. 12 దేశాలకు 25 వేల మంది వలంటీర్లపై 19 సార్లు ట్రయల్స్ చేసి మరీ ఈ ఫలితాలను నిర్ధారించుకున్నట్లు పరిశోధకులు చెప్పారు.

వారానికి మూడుసార్లు చేపలు తినడం ద్వారా కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చని పరిశోధకులు చెప్పారు. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐర‌న్‌ తదితర పోషకాలతో పాటు విటమిన్ డిని కూడా చేపల ద్వారా మన శరీరం గ్రహిస్తుందని వివరించారు. ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్‌, ట్రౌట్‌, టూనా, స్వోర్డ్‌ఫిష్, మాక‌రెల్, సార్డైన్స్‌, హెర్రింగ్ వంటి చేప‌ల ద్వారా ఈ ప్రయోజనాలు పొందొచ్చని తెలిపారు.

చేపలలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎన్‌-3 పీయూఎఫ్‌ఏ) మన గుండెతో పాటు కిడ్నీలకూ మేలు చేస్తోందని తాజా పరిశోధనల ద్వారా తేలిందని సైంటిస్టులు చెప్పారు. ఈ ఆమ్లాల వల్ల కిడ్నీల పనితీరులో క్షీణత నెమ్మదిస్తుందని వివరించారు. అయితే, మొక్కల నుంచి సేకరించిన ఎన్‌-3 పీయూఎఫ్‌ఏతో ఈ తరహా ప్రయోజనం కనిపించలేదని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News