KS Jawahar: లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: మాజీ మంత్రి కేఎస్ జవహర్

KS Jawahar warns YCP leaders in the wake of Nara Lokesh padayatra
  • జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • యువగళం పేరిట 4 వేల కిలోమీటర్ల నడక
  • లోకేశ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్న జవహర్
  • వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మరో ఐదు రోజుల్లో యువగళం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పందించారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. 

ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాకముందే జగన్మోహన్ రెడ్డికి, ఆయన వర్గానికి, వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. లోకేశ్ యాత్రను ఏ విధంగా అడ్డుకోవాలంటూ ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ యాత్ర ద్వారా అధికారుల స్థాన చలనాలు ఏవిధంగా ఉంటున్నాయి? రాష్ట్రంలో రాజకీయం ఏవిధంగా మారబోతోంది? అని ఆందోళనపడుతున్నారని వెల్లడించారు. 

"అధికారులు బూజుపట్టిన చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 1 ను అడ్డం పెట్టుకొని లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. జీవో నెంబర్ 1ను సాకుగా చూపి లోకేశ్ పాదయాత్ర వివరాలు అడుగుతున్నారు. వైసీపీ నాయకులు, అధికారులు భయపడుతున్నారనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బడుగు బలహీనవర్గాలవారు లోకేశ్ పాదయాత్ర కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రధానంగా యువత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. లోకేశ్ వస్తే వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకుగాను లోకేశ్ చేస్తున్న యువగళం కార్యక్రమానికి గొంతెత్తి యువత అండగా ఉండడానికి వస్తోంది. 

లోకేశ్ పాదయాత్రతో డీజీపీ, పోలీసులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు ఉలిక్కిపడుతున్నారు. జీవో నెం.1ని సాకుగా చూపి అడ్డుకోవాలని చూస్తున్నారు. అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా  పాదయాత్ర జరుగుతుంది, జరిగితీరుతుంది. పాదయాత్రకు ఎవరూ పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, యువత ఉపాధి కోసం, దళితుల రక్షణ కోసం, బడుగుల ఆత్మస్థైర్యం కోసం లోకేష్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రను పెద్ద ఎత్తున ప్రజలు విజయవంతం చేయడం ఖాయం. 

కాస్కోండి... చూస్కోండి... మీకు కళ్లుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారు.... చెవులుండి చెవిటివారిలా చేస్తున్నారు. డీజీపీ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది" అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పష్టం చేశారు.
KS Jawahar
Nara Lokesh
Yuva Galam
Padayatra
TDP
YSRCP

More Telugu News