England: 30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం.. పంపినవారు.. అందుకోవాల్సిన వారు ఇద్దరూ మృతి!
- ఇంగ్లండ్‌లో ఘటన
- 1995లో రాసిన లేఖను తాజాగా డెలివరీ చేసిన పోస్టల్ శాఖ
- 1880ల నాటి కుటుంబ కథల గురించి లేఖలో వివరణ
- తొలుత దానిని క్రిస్మస్ కార్డు అనుకున్నానన్న లేఖ అందుకున్న వ్యక్తి
నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నాడు ప్రముఖ కవి ఆరుద్ర. రైళ్లు మాత్రమే కాదు.. పోస్టల్ వాళ్లూ ఇలాగే నత్తనడకన సాగుతుంటారు. ఇందుకు బోల్డన్ని ఉదాహరణలు ఉన్నాయి. తపాలా శాఖ వారి నిర్వాకంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. మూడు దశాబ్దాల క్రితం ఓ వ్యక్తి పోస్టు చేసిన లేఖ.. తాజాగా డెలివరీ అయింది. పాపం! ఆ లెటర్ పంపిన వ్యక్తి, అందుకోవాల్సిన వ్యక్తి.. ఇద్దరూ ఇప్పుడు లేరు. వారు చాలా కాలం క్రితమే కన్నుమూశారు. లేఖను ఆలస్యంగా అంటే 30 ఏళ్ల తర్వాత డెలివరీ చేసిన ఘనకార్యం మనది కాదు లెండి.. ఇంగ్లండ్ పోస్టల్ వాళ్లది.
యూకేలోని నార్తంబర్‌ల్యాండ్‌కు చెందిన 60 ఏళ్ల జాన్ రెయిన్‌బోకు పోస్టల్ శాఖ తాజాగా ఓ లెటర్ అందించింది. అది చూసిన ఆయన షాకయ్యాడు. 1995లో పోస్టు చేసిన ఆ లెటర్ తాజాగా డెలివరీ కావడం మాత్రమే ఆయన షాక్‌కు కారణం కాదు.. ఆ ఇంట్లో ఇంతకుముందు నివసించిన వెలెరీ జార్విస్ రీడ్‌కు వచ్చిన ఉత్తరం అది.
పదవీ విరమణ అనంతరం రెయిన్బో 2015 నుంచి తన భార్యతో కలిసి వైలామ్‌లోని ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. ఆ లేఖలో 1880ల నాటి కుటుంబ కథల గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఉందని, తన పిల్లలు ఎలా పెరిగిందీ అందులో రాసుకొచ్చారని రెయిన్బో పేర్కొన్నారు.
నిజానికి తొలుత ఈ లేఖ గురించి తాను పట్టించుకోలేదన్నారు. దానిని క్రిస్మస్ కార్డు అనుకున్నానని, కానీ ఆ తర్వాత అది చాలా పాత ఉత్తరమని గుర్తించినట్టు చెప్పారు. చాలా ఆశ్చర్యకరంగా ఉందని, ఇక్కడ గతంలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని రెయిన్బో అన్నారు.