Elon Musk: రెండో బూస్టర్ డోస్ తీసుకున్నాక ప్రాణం పోతున్నట్టు అనిపించింది: మస్క్
- కరోనా వ్యాక్సిన్ దుష్ఫ్రభావంపై మస్క్ విమర్శలు
- తాను ఎదుర్కొన్న పరిస్థితిని వివరించిన ట్విట్టర్ అధినేత
- తన బంధువు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ట్వీట్
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కరోనా వ్యాక్సిన్ల దుష్ర్పభావంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను రెండో బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. ప్రాణం పోతున్నట్టు అనిపించిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల దుష్రభావం గురించి స్పందిస్తూ తాను ఎదుర్కొన్న పరిస్థితిని మస్క్ ట్విట్టర్ లో వివరించారు.
‘రెండో బూస్టర్ షాట్ తీసుకున్న తర్వాత నేను తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యాను. చాలా రోజు పాటు చచ్చిపోతున్నట్లు అనిపించింది. అయితే, దీని వల్ల శాశ్వత నష్టం జరగబోదని ఆశిస్తున్నా. మున్ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు’ అని ట్వీట్ చేశారు. ఒకే బూస్టర్ షాట్ అవసరమైనప్పుడు రెండోది ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు మస్క్ సమాధానం ఇచ్చారు. గిగా బెర్లిన్ లోని టెస్లా కార్యాలయన్ని సందర్శించాల్సిన అవసరం ఉండటంతో తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఇక, ఆరోగ్యవంతుడైన తన బంధువు వ్యాక్సిన్ వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. వ్యాక్సిన్లు రాకముందే తనకు కోవిడ్ సోకిందని మస్క్ వెల్లడించారు. అది కేవలం తేలికపాటి జలుబు మాత్రమే అన్నారు. ఇక తొలిసారి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొద్దిగా చేయి నొప్పి తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నారు. మొదటి బూస్టర్ వల్ల కూడా ఇబ్బంది రాలేదన్న మస్క్.. రెండోది మాత్రం తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పుకొచ్చారు.