jiyaguda: జియాగూడ హత్య కేసు.. చంపింది స్నేహితులే
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అక్షయ్, టిల్లు, సోనుగా గుర్తింపు
- ఆర్థిక కారణాలతోనే హత్యకు పాల్పడినట్లుగా అనుమానం
హైదరాబాద్ లోని జియాగూడలో నడిరోడ్డుపై ఆదివారం జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక కారణాలతో స్నేహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అక్షయ్, టిల్లు, సోనుగా గుర్తించారు. సాయినాథ్ ను అనుసరిస్తూ పక్కా పథకం ప్రకారమే వారు హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
జియాగూడలో కార్పెంటర్ గా పనిచేస్తున్న జంగం సాయినాథ్ ఆదివారం సాయంత్రం పురానాపూల్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. రోడ్డు మధ్యలో అందరూ చూస్తుండగానే ఇనుప రాడ్డు, కొడవలి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దారుణంగా చంపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
ఇంత జరుగుతున్నా ఎవరూ అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. సాయం కోసం సాయినాథ్ అరుస్తుంటే.. చూస్తుండిపోయారు. కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.