TTD: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ... టీటీడీ నిర్ణయం
- తిరుమల కొండపై డ్రోన్ కలకలం
- ఇటీవల వైరల్ అయిన శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజి
- ఇప్పటికే కేసు పెట్టామన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి
- తిరుమల భద్రతపై రాజీపడబోమని స్పష్టీకరణ
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్ సాయంతో శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజి చిత్రీకరించడం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో భద్రత డొల్లేనంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.
తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేశారు. తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు.
త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు. ఇది ఎంతో ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ, భద్రతకే ప్రాధాన్యత ఇచ్చి ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా డ్రోన్లు ఎగరేస్తే, ఆ డ్రోన్లలో ఉండే కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుందని వివరించారు.
అత్యుత్సాహంతోనే శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోందని, ఆ వీడియోను ల్యాబ్ కు పంపామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు వెల్లడించారు.