New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి జాతీయస్థాయి నేతలు
- ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభం
- హాజరుకానున్న స్టాలిన్, హేమంత్ సొరెన్
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ
తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ప్రారంభోత్సవం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నడుమ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది.
కాగా, తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయస్థాయి నేతలు తరలిరానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున లలన్ సింగ్ (జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.