Rohit Sharma: రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసినా.. శార్దూల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్.. వీడియో వైరల్!
- వరుస బంతుల్లో డరిల్ మిచెల్, టామ్ లాథమ్‌ను పెవిలియన్ పంపిన శార్దూల్
- ఆ తర్వాత ఫోర్లు సమర్పించుకోవడంతో రోహిత్ ఫైర్
- మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించిన రోహిత్
- బాబర్ ఆజం సరసన శుభమన్ గిల్
కివీస్‌తో నిన్న జరిగిన తుది వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. మూడు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించిన శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 386 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. అయితే, దూకుడు మీదున్న న్యూజిలాండ్‌ను శార్దూల్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 26వ ఓవర్‌లో వరుస బంతుల్లో డరిల్ మిచెల్ (24), కెప్టెన్ టామ్ లాథమ్ (0)లను పెవిలియన్ పంపి జట్టును విజయం దిశగా మళ్లించాడు.
అయితే, ఆ తర్వాత మాత్రం వరుసగా రెండు బౌండరీలు సమర్పించుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఆగ్రహం తన్నుకొచ్చింది. శార్దూల్‌ను సమీపించి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. శార్దూల్ లైన్ అండ్ లెంగ్త్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. అయితే, శార్దూల్ మాత్రం ఏం మాట్లాడకుండా కెప్టెన్ చెప్పింది శాంతంగా విన్నాడు. ఆ తర్వాత 29వ ఓవర్‌లో మరోమారు బంతులకు పదునుపెట్టి గ్లెన్ ఫిలిప్స్ (5)ను అవుట్ చేశాడు. శార్దూల్‌పై రోహిత్ మండిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు ఓవర్లు వేసిన శార్దూల్ 45 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు, బ్యాటింగులోనూ రాణించాడు. 17 బంతుల్లో 25 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి 54 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కాగా, మైదానంలో శార్దూల్‌పై మండిపడిన రోహిత్ మ్యాచ్ తర్వాత మాత్రం ప్రశంసలు కురిపించాడు. అతడిని ‘మెజీషియన్’గా అభివర్ణించాడు. శార్దూల్‌ను జట్టు సభ్యులు మెజీషియన్‌గా పిలుస్తారని తెలిపాడు.
తొలి మూడు స్థానాలు మనవే
మూడేళ్ల తర్వాత ఈ వన్డేలో శతకం (101) చేసిన రోహిత్ శర్మ తన ఖాతాలో 30వ వన్డే సెంచరీని వేసుకున్నాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికీ పాంటింగ్ సరసన చేరాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 50 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 46 సెంచరీలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ 30 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక సెంచరీల రికార్డు సాధించిన తొలి ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. మరోవైపు, ఈ మ్యాచ్‌లో సెంచరీ (112) సాధించిన శుభమన్ గిల్ మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సరసన చేరాడు. ఈ సిరీస్‌లో గిల్ మొత్తం 360 పరుగులు చేశాడు.