Nara Lokesh: ఏపీ ప్రజలకు లోకేశ్ బహిరంగ లేఖ.. జగన్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్న టీడీపీ నేత
- తనను ఆశీర్వదించి, ఆదరించాలన్న లోకేశ్
- టీడీపీ నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేసిందని వ్యాఖ్య
- వైసీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ఆగ్రహం
- పరిశ్రమ యజమానులను భయపెట్టి రాష్ట్రం నుంచి పంపించేస్తున్నారని ఆరోపణ
యువగళం పేరుతో 400 రోజుల పాదయాత్రకు సిద్ధమైన టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన పాదయాత్రను ముందుండి నడిపించాలని, తనను ఆశీర్వదించి ఆదరించాలని కోరారు. విభజన తర్వాత లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం గాడినపెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తోందన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను జగన్ తన ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపించే ప్రైవేటు సైన్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ అరాచక పాలన తమకొద్దంటూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల యజమానుల్ని భయపెట్టి రాష్ట్రం వదిలి పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఇవన్నీ సైకో పాలన దుష్ఫలితాలేనని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని లోకేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు.