Ongole: ఏడేళ్ల బాలికపై ‘హత్యాచారం’ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష

Ongole Court Sensational Verdict death sentence to Rapist
  • గిద్దలూరు మండలం అంబవరంలో 2021లో ఘటన
  • ఇంటి బయట ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం, హత్య
  • 18 నెలల్లోనే దోషికి శిక్ష పడిందన్న జిల్లా ఎస్పీ గార్గ్
  • పోలీసులు, కోర్టు సిబ్బందికి ప్రశంసా పత్రాలు, రివార్డుల అందజేత
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యచేసిన కామాంధుడికి ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్ధయ్య 8 జులై 2021లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల చిన్నారిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో మంచానికేసి గట్టిగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారి చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి సైకిలుపై తీసుకెళ్లి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిన్న నిందితుడిని దోషిగా నిర్థారించిన ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్‌చార్జ్) ఎంఏ సోమశేఖర్ మరణశిక్ష (చనిపోయేంత వరకు ఉరి) విధిస్తూ తీర్పు చెప్పారు.  

అలాగే, బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ. 10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, ఈ కేసులో 18 నెలల్లోనే దోషికి శిక్ష పడినట్టు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన అప్పటి దిశ స్టేషన్ డీఎస్పీ ధనుంజయుడు, సీఐ ఎండీ ఫిరోజ్, కోర్టు లైజన్ సిబ్బందిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు.
Ongole
Giddalur
Death Sentence
Andhra Pradesh

More Telugu News