basara: బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు
- అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- అక్షరాభ్యాసం కోసం వేలాదిగా వచ్చిన జనం
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసర ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ పర్వదినం నాడు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్రం నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ముందే ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని సమాచారం. అక్షరాభ్యాసం కోసం అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా చీరలను సిద్ధం చేశారు. మగ్గాలను బాసరకు తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలోనే చీరలను నేశారు. ఈ రోజు అమ్మవారిని ఈ చీరలతోనే అలంకరించారు.