Punganur: పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు ఎందుకు?.. నేను చాలు: రామచంద్ర యాదవ్

Industrialist Ramchandra Yadav Says will Contest against minister Peddi Reddy
  • పుంగనూరులో వైసీపీ ఆగడాలు పెరిగిపోయాయన్న రామచంద్రయాదవ్
  • వై ప్లస్ భద్రత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన పారిశ్రామికవేత్త
  • లోకేశ్‌ను తాను కలవలేదని స్పష్టీకరణ
  • ఏ పార్టీ నుంచి పోటీ చేసేది నెల రోజుల్లో చెబుతానన్న రామచంద్రయాదవ్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదని, తాను చాలని పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. తనకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దరెడ్డి అండదండలతో దౌర్జన్యాలు పెరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డిపై పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ప్రోత్సాహం, పోలీసుల అండదండలతో తన కార్యక్రమాలను కొందరు అడ్డుకుంటున్నారని, తన ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనకు వై ప్లస్ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనను హతమార్చేందుకు వైసీపీ నేతలు చేసిన దాడి కేసులో ఇప్పటి వరకు పురోగతి లేదని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను తాను కలవడం లేదని, తాను ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయంలో నెల రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
Punganur
Chittoor District
Ramachandra Yadav
Peddireddi Ramachandra Reddy
YSRCP

More Telugu News