Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah joins Rahul Gandhi in Bharat Jodo Yatra
  • రాహుల్ తో కలిసి నడిచిన మాజీ సీఎం ఒమర్ 
  • బీజేపీ వాళ్లు పిరికిపందలని విమర్శ 
  • దేశం గురించి ఆందోళన చెందుతున్నానని, అందుకే యాత్రలో పాల్గొంటున్నానని వెల్లడి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఈనెల 30న యాత్ర పూర్తి కానుంది. శుక్రవారం కశ్మీర్ లోకి ప్రవేశించగా.. రామ్ బన్ జిల్లాలోని బనీహల్ లో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి దాదాపు 2 కిలోమీటర్లు నడిచారు. వీరితోపాటు రెండు పార్టీల నేతలు, వందలాది కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. 

రైల్వే స్టేషన్ నుంచి ట్రక్ యార్డుకు చేరుకున్న తర్వాత.. పలు అంశాలపై రాహుల్, అబ్దుల్లా చర్చించారు. తర్వాత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కశ్మీర్ పండిట్ ఫ్యామిలీకి చెందిన రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని, అందుకే తాము ఆహ్వానించామని చెప్పారు. బీజేపీ వాళ్లు పిరికిపందలని మండిపడ్డారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని, మిలిటెన్సీ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరి గురించి తాను తెలుసుకోవాలని భావించడం లేదని చెప్పారు.

‘‘భారత్ జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ పెంచేందుకు ఉద్దేశించినది కాదు.. దేశంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చేపట్టినది. దేశం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా. అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నా. వ్యక్తిగత కీర్తి కోసం కాదు.. దేశ ప్రతిష్ఠ కోసమే యాత్రలో పాల్గొంటున్నాం’’ అని వివరించారు. అరబ్ దేశాలతో స్నేహ బంధం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ ప్రభుత్వంలో ముస్లిం ప్రతినిధి ఎవరూ లేరని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.
Rahul Gandhi
Omar Abdullah
Bharat Jodo Yatra
national conference
Jammu And Kashmir
Congress

More Telugu News