YS Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు హాజరవుతున్న వైఎస్ అవినాశ్ రెడ్డి.. వీడియో రికార్డింగ్ చేయాలని విన్నపం
- వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకానున్న అవినాశ్ రెడ్డి
- మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రాక
- తనతో పాటు లాయర్ ను అనుమతించాలని విన్నపం
దివంగత మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఈరోజు సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరుకాబోతున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సీబీఐ అధికారులు అవినాశ్ కు రెండుసార్లు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు విచారణకు హాజరుకానున్నారు.
తాను విచారణకు హాజరవుతున్నానని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరగుతున్నాయని లేఖలో ఆయన అన్నారు. మీడియాలోని ఒక వర్గం పని కట్టుకుని తనపై లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరగాలని... విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. తనతో పాటు ఒక లాయర్ ను అనుమతించాలని విన్నవించారు.