Jaishankar: పొరుగు దేశంతో సంబంధాలపై మహాభారతాన్ని ప్రస్తావించిన జైశంకర్

Just Like Pandavas Couldnt Pick Their Relatives says Jaishankar On Pak
  • పాండవులు తమ బంధువులను ఎంచుకోలేకపోయారు.. భారతదేశం కూడా పొరుగు వారిని ఎంపిక చేసుకోలేకపోయిందన్న విదేశాంగ మంత్రి జైశంకర్
  • మంచి బుద్ధి వస్తుందని సహజంగానే ఆశిస్తామని వెల్లడి
  • పాకిస్థాన్ లో ఏం జరుగుతోందనే దానిపై మాట్లాడబోనని వ్యాఖ్య
వేదిక ఏదైనా సరే.. భారతదేశాన్ని విమర్శిస్తే దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తుంటారు విదేశాంగ మంత్రి జైశంకర్. రష్యాతో వ్యాపారం విషయంలో యూరప్ అభ్యంతరాలు, భారతదేశంలో ప్రజాస్వామ్యంపై అమెరికా వ్యాఖ్యలపై జైశంకర్ ఇచ్చిన సమాధానాలతో అటువైపు నుంచి సమాధానమే కరువైంది. అందుకేనేమో ఈ మాజీ సివిల్ సర్వెంట్ ను ప్రధాని నరంద్ర మోదీ ఏరికోరి కేబినెట్ లోకి తీసుకున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ విషయంలోనూ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మహాభారతంలో పాండవులు తమ బంధువులను ఎలా ఎంపిక చేసుకోలేకపోయారో.. భారతదేశం కూడా భౌగోళికంగా పొరుగుదేశాలను ఎంపిక చేసుకోలేకపోయిందని జైశంకర్ చెప్పారు. పరోక్షంగా చైనా, పాక్ వంటి దేశాలను ఆయన కౌరవులతో పోల్చారు. ‘ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ ఎన్ అన్ సర్టైన్ వరల్డ్’ పేరిట ఇంగ్లిష్ లో జైశంకర్ రాసిన పుస్తకావిష్కరణ మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ఈ పుస్తకాన్ని మరాఠీలో ‘భారత్ మార్గ్’ పేరిట అనువదించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘వాస్తవం ఏంటంటే.. పాండవులు తమ బంధువులను ఎంచుకోలేకపోయారు. మనమూ అంతే.. పొరుగు వారిని ఎంపిక చేసుకోలేము. అయితే మంచి బుద్ధి వస్తుందని సహజంగానే మనం ఆశిస్తాం’’ అని జైశంకర్ అన్నారు. పొరుగుదేశం అణుశక్తి గలదైతే.. అది మనకు మంచిదా? నష్టమా? అని అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. పాకిస్థాన్ లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నించగా.. అక్కడ ఏం జరుగుతోందనే దానిపై తాను వ్యాఖ్యానించబోనని జైశంకర్ అన్నారు.
Jaishankar
Pakistan
Pandavas
mahabharat
external affairs minister
pune

More Telugu News