- అభిమానులు, సెలక్టర్లకు నిజం ఏంటో తెలుసన్న అశ్విన్
- కరోనా మహమ్మారి, ఇతర అంశాలను ముందుగా తెలుసుకోవాలని సూచన
- రోహిత్ శర్మ 2019 ప్రపంచకప్ లో సెంచరీల రికార్డు ప్రస్తావన
మీడియా గణాంకాలను ప్రచురించే, ప్రసారం చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను మరో క్రికెటర్ ఆర్ అశ్విన్ సమర్థించారు. రోహిత్ శర్మ సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ చేశాడంటూ మీడియా కథనాలను ప్రసారం చేయడం పట్ల టీమిండియా కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై ఆర్ అశ్విన్ స్పందించాడు.
ఒక బ్యాటర్ మూడు అంకెల స్కోరు లేకుండా ఇన్నేళ్లపాటు కొనసాగాడంటూ చెప్పే ముందు.. కరోనా మహమ్మారి సహా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీ చేయడం లేదన్న వార్తలు తరచూ రావడన్ని అశ్విన్ ప్రస్తావించాడు.
న్యూజిలాండ్ తో మూడో వన్డే మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో సెంచరీ కోసం మూడేళ్ల నిరీక్షణకు తెరపడందా? అంటూ రోహిత్ శర్మను ఒకరు ప్రశ్నించారు. పైనల్ మ్యాచ్ లో రోహిత్ వన్డేల్లో తన 30వ సెంచరీ రికార్డు నమోదు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు 1100 రోజుల పాటు అతడు ఒక్క వన్డే మ్యాచ్ లోనూ సెంచరీ చేయలేకపోయాడు. 16 మ్యాచ్ లు ఆడగా 5 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
‘‘సెంచరీ చేసి మూడేళ్లు, నాలుగేళ్లు అయిందని అభిమానులకు చెబుతూ ఉండొచ్చు. అభిమానులు, సెలక్టర్లు, ఇతరులకు నిజం ఏంటన్నది తెలుసు. 2019 ప్రపంచకప్ లో రోహిత్ సెంచరీ తర్వాత సెంచరీ సాధించి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గత 10-15 ఏళ్ల కాలంలో రోహిత్ శర్మ పనితీరు ప్రశ్నించలేనిది’’అని అశ్విన్ పేర్కొన్నాడు.