Khalistan: ఢిల్లీలో ఖలిస్తాన్ స్లీపర్ సెల్స్.. హెచ్చరించిన నిఘా వర్గాలు
- ఉగ్రవాద నెట్ వర్క్ లు యాక్టివ్ గా ఉన్నట్లు వెల్లడి
- దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రకటన
- పశ్చిమ ఢిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్లు కుట్రలో భాగమేనని అనుమానం
ఖలిస్తానీ స్లీపర్ సెల్స్ కు చెందిన ఉగ్రవాద నెట్ వర్క్ లు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్)లో యాక్టివ్ గా ఉన్నట్లు తెలిసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. వికాస్ పురి, జనక్ పురి, పశ్చిమ్ విహార్, పీరా ఘరి తదితర ప్రాంతాల్లో అభ్యంతరకరమైన నినాదాలతో వేసిన గ్రాఫిటీ పెయింటింగ్స్ కుట్రలో భాగం కావచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు, గోడలపై రాతలు ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో కనిపించడం కలకలం రేపింది. ప్రొ ఖలిస్తాన్ పోస్టర్లను స్థానిక పోలీసులు తొలగించగా.. దుండగులు మరోసారి గ్రాఫిటీతో నినాదాలు రాశారు. దీంతో ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు వేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు తమకు నిధులు అందుతున్నట్లు పోలీసు విచారణలో నిందితులు చెప్పారు.
కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టర్లు, పెయింటింగ్స్ వేసిన ప్రాంతంలో నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రొ ఖలిస్తాన్ గ్రూపులు.. దేశ రాజధానిలో శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగొచ్చన్న హెచ్చరికలతో నిఘా పెంచారు.