Anagani Sathyaprasad: ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి: అనగాని సత్యప్రసాద్

Anagani Sathyaprasad fires on AP Govt
  • జగన్ కు ఉపాధ్యాయులంటే చులకన అని వ్యాఖ్యలు
  • జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్న సత్యప్రసాద్
  • ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారుస్తున్నారని వెల్లడి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ కు ఉపాధ్యాయులంటే అంత చులకన ఎందుకని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా కనీసం జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వేధిస్తున్నారని పేర్కొన్నారు. 

ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేవాళ్లు గురువులు అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలని.... కానీ, ఈ ప్రభుత్వం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉన్న స్థానం నుంచి అథోస్థానానికి  దిగజారుస్తోందని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 

ఉపాధ్యాయులకు జీతాలు దండగ, పాఠశాలలకు వచ్చి నిద్రపోతున్నారంటూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడటం ఉపాధ్యాయులను అవమానించడమేనని స్పష్టం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్ మాటలను ప్రభుత్వం ఖండించలేదంటే ఇందులోని ఆంతర్యమేమిటి? అని సత్యప్రసాద ప్రశ్నించారు. టీచర్లు నిద్రపోవడానికే పాఠశాలకు వస్తున్నారంటూ మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. 

"ప్రవీణ్ ప్రకాశ్ వారానికి ఒకసారి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? ఎవరి డబ్బులతో వెళ్తున్నాడు? ఢిల్లీలో స్థిర నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ గెస్ట్ లా వచ్చి ఉపాధ్యాయులపై నోరు పారేసుకుంటున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడంలేదు?" అంటూ సత్యప్రసాద్ మండిపడ్డారు. 

"కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఉపాధ్యాయులను అవమానిస్తారా? కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి 976 మంది ఉపాధ్యాయులను బలితీసుకున్నారు. డీఏ బకాయిలు చెల్లించకపోవటం, పీఎఫ్ మంజూరులో జాప్యం చేయడం, ఉద్యోగ విరమణ తరువాత ఇచ్చే నిధులు చెల్లించకపోవడం, సీపీఎస్ పెన్షన్ నిధులు చెల్లించకపోవడం వంటి చర్యలతో వేధిస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వంటి 22 రకాల యాప్ లతో విధులు నిర్వహించాలంటూ వేధిస్తున్న ప్రభుత్వం ఎలక్షన్ డ్యూటీకి మాత్రం పక్కన పెడుతున్నారు. 

ఫేషియల్ యాప్ తో జీతాలకు లింకుపెట్టే కుట్ర జరుగుతోంది. జీతం చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం రుణాలు తీసుకున్న ఉద్యోగుల పరపతిని దెబ్బ తీస్తోంది. ప్రభుత్వ సలహాదారులకు, మంత్రులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం... ఉపాధ్యాయులకు ఒక్కనెల అయినా 1వ తారీఖున వేతనాలు ఇచ్చారా? 

జగన్ ప్రభుత్వ చర్యలతో ఉపాధ్యాయుల కుటుంబ అవసరాల కోసం అప్పు పుట్టని పరిస్థితి నేడు నెలకొంది. ఉద్యోగ విరమణ చేసిన రోజే రావాల్సిన సంస్థ ప్రయోజనాలు, పెన్షన్ పేపర్లు కూడా అందించే సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి వేధింపు చర్యలకు దిగుతున్నారు" అంటూ అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Anagani Sathyaprasad
Jagan
YCP
Teachers
TDP
Andhra Pradesh

More Telugu News