Narendra Modi: ఈ చిన్న గ్రామంలో ఉన్న శిలాశాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రధాని మోదీ
- మన్ కీ బాత్ ప్రసంగం వెలువరించిన ప్రధాని మోదీ
- ఉతిర్మెరూర్ గ్రామం గురించి ప్రస్తావన
- ఈ గ్రామంలో 1200 ఏళ్ల నాటి శిలాశాసనం ఉందని వెల్లడి
- ఇది ఒక చిన్న రాజ్యాంగం వంటిదని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్ ప్రసంగంలో ఆసక్తికర అంశం వెల్లడించారు. తమిళనాడులో చిన్నదే కానీ ఎంతో జనాదరణ కలిగిన ఒక గ్రామం ఉందని వెల్లడించారు. ఆ గ్రామం పేరు ఉతిర్మెరూర్ అని తెలిపారు. అక్కడ ఉన్న 12 వందల ఏళ్ల నాటి ఒక శిలాశాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని మోదీ వివరించారు.
ఈ శిలాశాసనం ఒక చిన్న రాజ్యాంగం వంటిదని, ఇందులో గ్రామసభను ఎలా నడపాలి, సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి అనే అంశాలు చక్కగా వివరించారని తెలిపారు. మనదేశ చరిత్రలోని ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణగా 12వ శతాబ్దపు బసవేశ్వరుడి అనుభవ మండపం అని పేర్కొన్నారు. అక్కడ స్వేచ్ఛా వాదనలకు, చర్చలకు ప్రోత్సాహం లభించేదని వివరించారు. ఇది మాగ్నా కార్టా ముందు కాలం నాటిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
మాగ్నా కార్టా ఆవిర్భావంతో 800 ఏళ్ల నాడు ప్రజాస్వామ్యం పురుడుపోసుకోవడం ఒక చారిత్రాత్మక సంఘటన. అప్పట్లో రాజులే సర్వాధికారంతో కొనసాగేవారు. బ్రిటన్ రాచరికంలో అయితే చక్రవర్తులు దైవాంశ సంభూతులు అనేంతగా ప్రజలపై నిరంకుశత్వాన్ని రుద్దారు.
అయితే రాజు అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదని, రాజైనా సరే చట్టపరమైన పాలనకు లోబడి ఉండాల్సిందేనంటూ రూపొందిన తొలి హక్కుల పత్రమే మాగ్నా కార్టా. ఈ పత్రంపై 1215లో బ్రిటన్ రాజు జాన్ విధిలేని పరిస్థితుల్లో సంతకం చేసిన క్షణాలే ప్రజాస్వామ్యానికి బీజం వేశాయి.