Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్... నాదల్ రికార్డు సమం
- సిట్సిపాస్ ను వరుస సెట్లలో ఓడించిన జకోవిచ్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ కు ఇది 10వ టైటిల్
- ఓవరాల్ గా 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్
- ఇప్పటిదాకా నాదల్ పేరిట ఉన్న రికార్డు
సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ 6-3, 7-6, 7-6తో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ ను వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్ ను సునాయాసంగా గెలిచిన జకో... ఆ తర్వాత రెండు సెట్లలో సిట్సిపాస్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే ఆ రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లగా, జకోవిచ్ పైచేయి సాధించాడు.
కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చాంపియన్ గా నిలవడం జకోవిచ్ కు ఇది పదోసారి. అంతేకాదు, ఈ టైటిల్ తో జకోవిచ్... రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్లుగా జకోవిచ్ (22), నాదల్ (22) సమవుజ్జీలుగా నిలిచారు.