CM KCR: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన
- బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహారాలపై చర్చ
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించారు.
గతంతో పోల్చితే బీజేపీతో తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్నందున, పార్లమెంటు వేదికగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కర్తవ్యబోధ చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీజేపీ విధానాలు దేశాభివృద్ధికి ఆటంకాలు అని పేర్కొన్నారు. దేశ సంపదను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని అన్నారు. దేశ వనరులను మోదీ తన కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎల్ఐసీ వాటాలను అదానీకి అప్పగించారని, అదానీ షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయిందని తెలిపారు. లాభాల సంపాదన అంతా నీటిబుడగలేనని అర్థమైపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్రం విధానాలపై ఉభయ సభల్లో గొంతెత్తాలని బీఆర్ఎస్ ఎంపీలకు స్పష్టం చేశారు. కలిసివచ్చే పార్టీలను కలుపుకుంటూ పార్లమెంటులో పోరాడాలని సూచించారు. బీజేపీ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలని తెలిపారు.