Green Comet: మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. స్పష్టంగా చూసే అదృష్టం విజయవాడ వాసులకే!

Rare Green Comet To Make Closest Approach To Earth
  • ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఆకాశంలో దర్శనం ఇవ్వనున్న తోకచుక్క
  • 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కామెట్’
  • మళ్లీ ఇన్నాళ్లకు కనువిందు చేయనున్న వైనం
  • ఇప్పుడు చూడకుంటే జీవితంలో మళ్లీ చూడలేరు 
మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కామెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఈ తోకచుక్క 50 వేల ఏళ్ల క్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇది ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 'గ్రీన్ కామెట్‌'కు శాస్త్రవేత్తలు C/2022 E3 (ZTF)గా నామకరణం చేశారు.

తోకచుక్కలు అంటే మరేంటో కావని, వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలేనని ముంబైలోని అక్షయ గంగ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ సభ్యుడు అమృతాన్షు వాజపేయి తెలిపారు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయని, సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయన్నారు. భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తోక చుక్కల ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.

కాగా, బుధవారం అంటే రేపు ఈ తోకచుక్క భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఇప్పుడు దీనిని చూడలేకపోతే జీవితంలో మళ్లీ చూడడం సాధ్యం కాదని పేర్కొంది. ఎందుకంటే ఇది మళ్లీ మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి సమీపానికి వస్తుంది. దీన్ని బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.
Green Comet
C/2022 E3 (ZTF)
NASA
Vijayawada

More Telugu News