Anand Mahindra: ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే అద్భుతం: ఆనంద్ మహీంద్రా
- దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలక జీవనాడి అవుతుందన్న ఆనంద్ మహీంద్రా
- బాగా గొప్పగా చేశారంటూ కేంద్ర మంత్రికి కితాబు
- ఐదు రాష్ట్రాల పరిధిలో 1350 కిలోమీటర్లు సాగిపోయే రహదారి
ప్రముఖ పారిశ్రామికవేత్త అయి, ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా.. సమాజానికి కూడా కొంత సమయం కేటాయిస్తుంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు విషయాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మందిని ఆలోచింపజేయడం, ప్రోత్సహించడం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే (వేగంగా దూసుకుపోయే జాతీయ రహదారి) గురించి ఆయన ప్రస్తావన చేశారు. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా పేర్కొన్నారు.
‘‘ఇది భారత దేశ ఆర్థిక రహదారికి కీలక నాడి కానుంది. కీలకమైన ఇలాంటి అనుసంధాన రహదారులతో రవాణా సమయం తగ్గించడం వల్ల దేశ జీడీపీ లెక్కించలేని విధంగా పెరుగుతుంది. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోను జత చేశారు.
‘‘1,450 కిలోమీటర్ల పాటు సాగిపోయే ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రపంచ స్థాయి రహదారి నిర్మాణానికి ఉదాహరణ. ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది’’ అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం 24 గంటలు పట్టే సమయం 12 గంటలకు తగ్గిపోనుండడం గమనార్హం. జర్మన్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకువెళ్లేందుకు అనుకూలమైన 8లేన్ల రహదారి ఇది. మొత్తం దూరం 1350 కిలోమీటర్లు. హర్యానా, రాజస్థాన్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ వెళుతుంది.