adoption: దత్తతకు ఆడపిల్లే కావాలి.. తెలంగాణలో మారిన ట్రెండ్
- ఎనిమిదేళ్లలో 1,430 పిల్లల దత్తత
- అందులో 1,069 మంది అమ్మాయిలే
- దత్తత తీసుకునే దంపతులు హైదరాబాద్ లోనే ఎక్కువ
ఆరోగ్య సమస్యలతో పిల్లలు పుట్టని దంపతులు అనాథలను దత్తత తీసుకుని తల్లిదండ్రులుగా మారుతున్నారు. గతంలో దత్తతకు అబ్బాయే కావాలని ఎక్కువగా కోరుకునేవారు. కానీ కొంతకాలంగా ఈ ట్రెండ్ మారిందని, దత్తతకు పాపే కావాలని దంపతులు కోరుతున్నారని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. పిల్లలు లేని దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసుకోవడం పెరుగుతోందని వివరించారు.
ఆ దరఖాస్తుల్లో తమకు పాప కావాలని పేర్కొనే వారి సంఖ్యే ఎక్కువని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే తల్లిదండ్రులు మహిళా శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి అనుమతించాకే లీగల్ గా దత్తత తీసుకోవడం సాధ్యమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు అంటే ఎనిమిదేళ్లలో 1,430 మంది పిల్లలు దత్తతకు వెళ్లారు. ఇందులో 1,069 ఆడ పిల్లలు కాగా, అబ్బాయిల సంఖ్య 361 మాత్రమే. ఆడపిల్లలను దత్తత తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి మరో కారణం.. వెయిటింగ్ టైమ్ తక్కువగా ఉండడమేనని అధికారులు చెబుతున్నారు.
ఆడపిల్లను దత్తత తీసుకోవాలని దరఖాస్తులో కోరితే ఏడాదిలోపే దత్తత కార్యక్రమం పూర్తిచేసి పాపను తీసుకెళ్లొచ్చని చెప్పారు. అబ్బాయే కావాలని చూస్తే మాత్రం దరఖాస్తు చేసుకున్న తర్వాత కనీసం మూడు నుంచి నాలుగేళ్లు ఎదురుచూడాల్సిందేనని వివరించారు. కాగా, రాష్ట్రంలో పిల్లలను దత్తత తీసుకునే దంపతుల సంఖ్య హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.