Anam Ramanarayana Reddy: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
- సొంత పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న ఆనం
- రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని వ్యాఖ్య
- వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని కామెంట్
ఫోన్ ట్యాపింగ్ అంశం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మరో సీనియర్ నేత అదే తరహా ఆరోపణలు చేశారు. గత ఏడాదిన్నరగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఉందని... రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని అన్నారు.
తనకు ఇప్పటికే భద్రతను తగ్గించారని... పూర్తిగా భద్రతను తొలగించాలని కోరుతున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని... ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని... ఈలోగా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేయించడం వంటి పోకడలు ఎన్నడూ లేవని... ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని... తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపై తన రాజకీయ జీవితం ఆధారపడి లేదని అన్నారు.