tirumala: తిరుమల మాడవీధుల్లో సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం
- మాడవీధుల నుంచి బయటికి వచ్చిన కారు
- ప్రభుత్వ వాహనమని సూచించేలా ‘సీఎంవో’, ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్లు
- ఇటీవల కలకలం రేపిన శ్రీవారి డ్రోన్ విజువల్స్
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం వెళ్లింది. సీఎం కార్యాలయానికి సంబంధించిన వాహనమని సూచించేలా కారుపై ‘సీఎంవో’, ‘ప్రభుత్వ వాహనం’ అన్న స్టిక్కర్లు ఉన్నాయి.
మాడవీధుల్లో ప్రైవేటు వాహనాల రాకపోకలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిషేధం విధించింది. కానీ ఆ వాహనం మాత్రం మాడవీధుల్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. మాడవీధుల నుంచి కారు బయటికి రావడం అందులో కనిపించింది. కారులో మాడవీధుల్లోకి ఎవరు, ఎందుకు వెళ్లారు? వారికి అనుమతి ఇచ్చింది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నో ఫ్లై జోన్ లో ఉన్న శ్రీవారి ఆలయం ప్రాంగణంలోకి డ్రోన్ వెళ్లడం దుమారం రేపింది. ఈ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు మాడవీధుల్లో కారు తిరుగుతూ కనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.