Devineni Uma: వివేకా హత్య కేసు కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తెస్తుండడంతో విశాఖ వ్యవహారం తెరపైకి తెచ్చారు: దేవినేని ఉమ
- సీఎం జగన్ అభద్రతాభావంలో ఉన్నారన్న దేవినేని ఉమ
- కేసు విచారణలో ఉండగా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం
- వివేకా హత్య కేసు ముద్దాయిలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు
ఏపీ సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. వివేకా హత్యకేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తీసుకువస్తోందని, దీన్నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ వ్యవహారం మళ్లీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కేసు విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడతారని ఉమ ప్రశ్నించారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అన్నారు.
బాబాయ్ హత్యకేసులో ముద్దాయిలను కాపాడేందుకు ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రకటించడం విపక్షాలను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. వైసీపీ నేతలు సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, విపక్షనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.