Emirates Airline: ఎమిరేట్స్ విమాన ప్రయాణికులకు చేదు అనుభవం.. 13 గంటలు ప్రయాణించి టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయిన విమానం!

Emirates Flight to New Zealand Lands At The Same Place after 13 hours Journey

  • శుక్రవారం ఉదయం దుబాయ్‌లో బయలుదేరిన విమానం
  • 9 వేల మైళ్లు ప్రయాణించిన తర్వాత వెనక్కి మళ్లిన విమానం
  • శనివారం అర్ధరాత్రి మళ్లీ దుబాయ్‌లోనే ల్యాండింగ్
  • ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్‌ను వరద ముంచెత్తడమే కారణం

దుబాయ్ నుంచి న్యూజిలాండ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం దుబాయ్‌లో టేకాఫ్ అయిన విమానం 13 గంటలపాటు ప్రయాణించి మళ్లీ దుబాయ్‌లోనే దిగింది. దీంతో విస్తుపోవడం, విసిగిపోవడం ప్రయాణికుల వంతైంది. ఎమిరేట్స్ విమానం ఈకే448 శుక్రవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 10.30 గంటలకు దుబాయ్‌లో టేకాఫ్ అయింది. సగం దూరం అంటే దాదాపు 9 వేల మైళ్లు ప్రయాణించిన తర్వాత పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి శనివారం అర్ధరాత్రి మళ్లీ దుబాయ్‌లోనే ల్యాండ్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

న్యూజిలాండ్‌లో విమానం ల్యాండ్ కావాల్సిన ఆక్లాండ్ విమానాశ్రయాన్ని వరదలు ముంచెత్తడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. మధ్యలోనే సమాచారం అందుకున్న పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఈ ఘటనపై ఆక్లాండ్ ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. ఇది అసహనానికి గురిచేసేదే అయినా ప్రయాణికుల భద్రత తమకు చాలా ముఖ్యమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరదల కారణంగా తమ అంతర్జాతీయ టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని ఆక్లాండ్ విమానాశ్రయం అంచనా వేస్తోందన్నారు. ఈ రోజు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపలేదని పేర్కొన్నారు. ఈ ఘటన తీవ్ర నిరాశ పరిచేదే అయినా ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని అన్నారు. 

న్యూజిలాండ్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాశ్రయం నీటితో నిండిపోయింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం నుంచి ఆక్లాండ్ విమానాశ్రయంలో తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాగా, విమానాశ్రయాన్ని వరద ముంచెత్తిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News