Pakistan: ప్రార్థనలు చేస్తున్న వారిని ఇండియాలో ఎప్పుడూ చంపలేదు.. పాకిస్థాన్‌లోనే అలా జరుగుతోంది: పాక్ మంత్రి
- పెషావర్ మసీదులో జరిగిన పేలుడులో 100 మంది మృతి
- ఇలాంటి ఘటనలు పాకిస్థాన్‌లో తప్ప మరెక్కడా జరగవని మంత్రి ఆవేదన
- హౌస్ ఏకమై ఉగ్రవాదంపై చర్చలు జరపాలని పిలుపు
- శాంతి స్థాపన జరగాల్సిందేనన్న మంత్రి
పాకిస్థాన్, పెషావర్‌లోని మసీదులో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. ఈ ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా అసిఫ్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రార్థనల సమయంలో భక్తులను చంపడం ఇండియాలో కానీ, ఇజ్రాయెల్‌లో కానీ లేదని, అది ఒక్క పాకిస్థాన్‌లోనే జరుగుతోందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో ఏకం కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హౌస్‌ను క్రమబద్ధీకరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
2010-2017 మధ్య దేశంలో జరిగిన ఉగ్ర ఘటనలను గుర్తు చేసిన మంత్రి.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ హయాంలో స్వాత్ నుంచి ప్రారంభమైన ఈ యుద్ధం పీఎంఎల్-ఎన్ మునుపటి హయాంలో ముగిసిందన్నారు. కరాచీ నుంచి స్వాత్ వరకు దేశంలో శాంతిని స్థాపన జరిగిందన్నారు. రెండేళ్ల క్రితం ఇదే హాలులో రెండుమూరు సార్లు బ్రీఫింగ్ ఇచ్చిన విషయం మీకు గుర్తుండే ఉంటుందని మంత్రి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్చలు జరపవచ్చని, ప్రజలను శాంతి వైపు మళ్లించవచ్చని చెప్పామని పేర్కొన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ నిశ్చయాత్మక నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిన తర్వాత వేలాదిమంది ఆప్ఘనీలు పాక్ వచ్చి స్థిరపడ్డారని, ఫలితంగా వేలాదిమంది ప్రజలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం పొందిన ప్రజలకు వ్యతిరేకంగా స్వాత్ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ఇందుకు తొలి రుజువు అని పేర్కొన్నారు. మొన్నటి విషాదం కారణంగానే తానీ విషయాలను ప్రస్తావిస్తున్నట్టు మంత్రి అసిఫ్ వివరించారు.