Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్... దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
- ట్యాక్స్ రిబేటు విస్తరణ
- కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
- 1000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
- 300 పాయింట్ల వృద్ధితో నిఫ్టీలో ట్రేడింగ్ జోరు
కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 1000 పాయింట్లకు పెరగ్గా, నిఫ్టీ 300 పాయింట్లు ఎగబాకింది. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ తదితర సూచీలు భారీ ట్రేడింగ్ లు నమోదు చేస్తున్నాయి. అదే సమయంలో ఎనర్జీ రంగం సూచీలు పతనమయ్యాయి.
ఐసీఐసీఐ, టాటా స్టీల్ షేర్లు లాభాల బాటలో పయనిస్తుండగా, అదాని సంస్థలు, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, ఎస్ బీఐ లైఫ్ షేర్లు మాత్రం నిరాశ కలిగించాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 60,213.59 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ 17,826.10 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
బడ్జెట్ సందర్భంగా, కనిష్ఠ ట్యాక్స్ రిబేటు పరిమితిని విస్తరిస్తూ కేంద్రం చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లకు ఊపందించింది. అదే సమయంలో పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించడం కూడా ట్రేడింగ్ జోరు పెరగడానికి కారణమైందని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.