Nara Lokesh: డ్రోన్ సర్వే పేరుతో భూములు కొట్టేస్తున్నారు: వైసీపీ సర్కారుపై లోకేశ్ ఫైర్
- పలమనేరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- నక్కపల్లి గ్రామంలో భూముల సర్వే రాళ్లను పరిశీలించిన లోకేశ్
- జగన్ రెడ్డి భూములు దోచుకుంటున్నాడని విమర్శలు
- కొలమాసనపల్లిలో మహిళలతో లోకేశ్ ముఖాముఖి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ పాదయాత్రకు నేడు 6వ రోజు. ఇవాళ నక్కపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూముల రీసర్వే సరిహద్దు రాళ్ళను లోకేశ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ యువనేతకు తమ సమస్యలు చెప్పుకున్నారు. భూ సర్వే తరువాత భూమి తక్కువ చేసి చూపిస్తున్నారని, బలవంతంగా పాస్ బుక్ చేతిలో పెడుతున్నారని వాపోయారు. ఏమైనా సమస్య ఉంటే అర్జీలు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోతున్నారని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూమి ఎలా తగ్గుతుంది... అధికారుల చుట్టూ తిరిగే ఆర్ధిక స్తోమత మాకు లేదు అంటూ స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
దాంతో లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే పేరుతో భారీ స్కాం జరుగుతోందని ఆరోపించారు. "మీ భూములు జగన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. అది భూరక్ష కాదు జగన్ రెడ్డి భూ భక్ష. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న భూమిని డ్రోన్ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం దోచుకోవాలని చూస్తుంది. భూమి తగ్గింది అని చెప్పి అధికారుల చుట్టూ తిరగమనడం దారుణం. మేం గెలిచిన వెంటనే జగన్ ప్రజల నుండి దోచుకున్న భూమి తిరిగి ప్రజలకి ఇస్తాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.
అటు, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కొలమాసనపల్లిలో మహిళలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... "రూ.5 లక్షలు లోన్లు ఇస్తామని అన్నారు. ఇవ్వలేదు. ఇంటి పన్నులు పెంచారు. మా భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. పట్టాను కూడా ఫోర్జరీ చేసి మమ్మల్ని మోసం చేశారు. మద్యపాన నిషేధం అన్నారు చేయలేదు. భర్తల సంపాదన మద్యానికే పోతోంది. ఆటోలు, బస్సుల్లో వెళ్లాలంటే భయంగా ఉంది. వీటిలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు అధికంగా పెరిగాయి. ఏమైనా కష్టాలుంటే ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే, పోలీసులు కూడా వైసీపీ వాళ్లనే పట్టించుకుంటున్నారు" అని గోడు వెళ్లబోసుకున్నారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... జగన్ రెడ్డి మాయమాటలతో మహిళల్ని మోసం చేశారని మండిపడ్డారు. 45సంవత్సరాల వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి, ఒక్కరికే పరిమితం చేశాడని విమర్శించారు.
"సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ఏపీలో అమ్మే పురుగుల మందులు పనిచేయడం లేదు... మద్యం మాత్రం పురుగుల మందుల్లా పనిచేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నోటికొచ్చిన విధంగా హామీలిచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి... తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తాడు?
చంద్రబాబు రూ.20 వేల కోట్లు పసుపు, కుంకుమ కింద ఇచ్చారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, పండుగ కానుకలు ఇచ్చాం... నేడు అవేవీ లేవు. ఎన్నికల ముందు పెంచుతూ పోతానని చెప్పి... అధికారంలోకి వచ్చాక ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచారు.
నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే, డ్వాక్రా సంఘాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులను సరిచేసి, నిత్యావసర ధరలు తగ్గించడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు" అని వెల్లడించారు.