Sagar: డైరెక్టర్ సాగర్ అంటే మద్రాసులో అంతా భయపడేవారట!
- ఈ ఉదయమే తుది శ్వాస విడిచిన సాగర్
- 90లలో దర్శకుడిగా మంచి పేరు
- ఎడిటింగ్ పై కూడా ఆయనకి మంచి పట్టు
- అవకాశాల కోసం ఎవరినీ యాచించలేదన్న సాగర్
90వ దశకంలో విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల జాబితాలో సాగర్ ఒకరుగా కనిపిస్తారు. క్రమశిక్షణ గల దర్శకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. ఇటు కుటుంబ కథాచిత్రాలను .. అటు యాక్షన్ సినిమాలతో అలరించిన ఘనత ఆయన ప్రత్యేకతగా కనిపిస్తుంది. అలాంటి సాగర్ అనారోగ్య కారణాల వలన ఈ రోజు ఉదయమే అభిమాన లోకాన్ని వదిలివెళ్లారు.
ఇక తాను బయటికి కనిపించేంత సాఫ్ట్ కాదని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను పెరిగిందంతా కూడా మద్రాసులోనే .. అందువలన అక్కడ నాకు విపరీతమైన సర్కిల్ ఉండేది. ఎక్కువగా నా ఫ్రెండ్స్ తో కలిసి పిట్టగోడలపై కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లో తెలుగువారిని తమిళవాళ్లు హేళన చేస్తూ ఉండేవారు. అలాంటివారిని పట్టుకుని మేము చితక్కొట్టేవాళ్లం. దాంతో వాళ్లు తెలుగువాళ్ల జోలికి రావడానికి భయపడేవారు" అన్నారు.
"ఇలా చేయడం వలన నేను రౌడీని అనే ముద్రపడిపోయింది. నేను బజార్లో వెళుతుంటే కూడా ఇళ్లలో నుంచి భయపడుతూ చూసేవారు. చివరికి మా అమ్మగారికి ఈ విషయం తెలిసి చాలా బాధపడింది. దాంతో నేను ముందుగా ఎడిటింగ్ పై .. ఆ తరువాత డైరెక్షన్ పై దృష్టి పెట్టాను. అవకాశాల కోసం ఎవరినీ ఎప్పుడూ యాచించలేదు. నా దగ్గరికి వచ్చినవాటిలో నాకు నచ్చినవే చేశాను. ఒకప్పుడు సినిమాలకి సంబంధించిన చర్చలు ఆఫీసుల్లో ఎంతో హుందాగా జరిగేవి .. కానీ ఇప్పుడు రోడ్డుపక్కనే జరిగిపోతుండటమే బాధాకరం" అని ఆయన అన్నారు.