Blinken: భారత్ కు వ్యతిరేకంగా చైనా దురాక్రమణ ఆమోదనీయం కాదు: అమెరికా రిపబ్లికన్ సెనేటర్లు
- చైనాకు ఇదే తేల్చి చెప్పాలని రిపబ్లికన్ సెనేటర్ల డిమాండ్
- విదేశాంగ మంత్రి బ్లింటెన్, ఆర్థిక మంత్రి యెల్లెన్ కు లేఖ
- చైనాలో వీరి పర్యటనకు ముందు చోటుచేసుకున్న పరిణామం
భారత్, తైవాన్ విషయంలో చైనా దుందుడుకు వైఖరి తమకు ఆమోదనీయం కాదని ఆ దేశ నాయకత్వానికి గట్టిగా చెప్పాలంటూ రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను కోరారు. ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. 2018 తర్వాత బీజింగ్ ను సందర్శిస్తున్న తొలి అమెరికా ప్రముఖుడు బ్లింకెన్ కావడం గమనార్హం. మ్యాక్రో రూబియో ఆధ్వర్యంలోని రిపబ్లికన్ సెనేటర్ల బృందం బ్లింకెన్ కు ఈ విషయమై ఓ లేఖ రాసింది.
బ్లింకెన్ వెంట బీజింగ్ సందర్శిస్తున్న అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెల్లెన్ ను ఉద్దేశించి కూడా సెనేటర్లు ఈ లేఖ రాశారు. హిమాలయ ప్రాంతంలో భారత్, తైవాన్ కు వ్యతిరేకంగా చైనా వ్యవహరిస్తున్న దురాక్రమణ వైఖరి ఆమోదనీయం కాదని చెప్పాలంటూ బ్లింకెన్, యెల్లెన్ ను వారు కోరారు. అదే సందర్భంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ప్రచార విజయానికి దూరంగా ఉండాలని సూచించారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిత్ర దేశాల పట్ల దూకుడైన విధానానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీని జవాబుదారీ చేయాలని కోరారు.