Adani row: అదానీ గ్రూప్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. మధ్యాహ్నానికి వాయిదా
- అదానీ గ్రూపులో ఎస్ బీఐ, ఎల్ఐసీ పెట్టుబడులపై చర్చకు విపక్షాల నోటీసులు
- తిరస్కరించిన ఉభయ సభల అధ్యక్షులు
- నినాదాలతో దూసుకుపోయిన విపక్ష ఎంపీలు
అదానీ గ్రూపు పై వచ్చిన ఆరోపణలు పార్లమెంటు ఉభయ సభలను గురువారం కుదిపేశాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించడంతో వారు ఆగ్రహంతో గందరగోళం సృష్టించారు. పోడియంలోకి చొచ్చుకుపోయి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది.
అనంతరం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్ బీఐ పెట్టుబడుల విలువ తరిగిపోతోందన్నారు. దీనిపై రూల్ 267 కింద సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ ఇచ్చినట్టు చెప్పారు. ‘‘దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా నోటీసులను తిరస్కరించారు. ముఖ్యమైన అంశాలను ప్రస్తావించగా, చర్చించేందుకు సమయం ఇవ్వడం లేదు. ఎల్ఐసీ, ఎస్ బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేదల డబ్బులు ఉన్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలోని బృందంతో అయినా దీనిపై విచారణ చేయించాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు.