Andhra Pradesh: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. రంగంలోకి ఇంటెలిజెన్స్!
- ఆడియో రికార్డు వివరాలను సేకరించే పనిలో అధికారులు
- శ్రీధర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన రామశివారెడ్డిని విచారించే అవకాశం
- సజ్జల, ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం జగన్ భేటీ
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాయి. ట్యాపింగ్ పై ఆధారాలను బయటబెట్టిన ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తనలాంటి వ్యక్తి ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వినాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన శ్రీధర్ రెడ్డి నమ్మకం లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కోటంరెడ్డి మీడియా సమావేశం తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. కోటంరెడ్డి వ్యాఖ్యలపై చర్చించినట్టు సమాచారం.
మరోపక్క, ఇది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అంటూ మంత్రులు.. శ్రీధర్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ విషయంపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కోటంరెడ్డి బయటపెట్టిన ఆడియో రికార్డు వివరాలను సేకరించే పనిలో వారు పడ్డారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రామశివారెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాలి.