PALNADU: టీడీపీ నేతపై కాల్పుల ఘటన పట్ల జిల్లా ఎస్పీ వివరణ
- పల్నాడు జిల్లాలో బాలకోటిరెడ్డిపై తుపాకీతో కాల్పులు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపిన దుండగులు
- నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపి, పరారయ్యారు. ఈ ఘటనలో ఆయన కడుపు ఎడమభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్సీ రవిశంకర్ రెడ్డి స్పందిస్తూ... బాలకోటిరెడ్డి, ఆయనపై కాల్పులు జరిపిన వెంకటేశ్వరరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. ఎంపీటీసీ పదవిని ఇప్పిస్తానని వెంకటేశ్వరరెడ్డి వద్ద బాలకోటిరెడ్డి రూ. 6.50 లక్షలు తీసుకున్నారని తెలిపారు. బాలకోటిరెడ్డిని చంపడానికి రూ. 4.50 లక్షల డీల్ జరిగిందని చెప్పారు. గన్ ను రాజస్థాన్ లో రూ. 60 వేలకు కొన్నారని తెలిపారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్ తట్టారని, తలుపు తీసిన వెంటనే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు.