Chandrababu: వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తప్పించుకోలేడు.. అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయి: చంద్రబాబు

Jagan can not escape from YS Viveka murder case says Chandrababu

  • రాష్ట్రాన్ని జగన్ ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్న చంద్రబాబు
  • కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కావాల్సినవి సాధించడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శ
  • ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కుతున్నారని వ్యాఖ్య
  • పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ అని... ఆయన పేదల గురించి చెప్పడమా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని విమర్శించారు. ఆంక్షలు విధించడం, కేసులు పెట్టడం, ఫోన్ ట్యాపింగులు చేయడం తప్ప రాష్ట్రం గురించి జగన్ కు పట్టడం లేదని విమర్శించారు.

 విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. వైసీపీ ఎంపీలు సొంత లాబీయింగ్ కోసమే పని చేస్తున్నారని, రాష్ట్రం కోసం పని చేయడం లేదని దుయ్యబట్టారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పొందడంలో పూర్తిగా విఫలమయ్యారని... ప్రత్యేక హోదా, కరువు జిల్లాలకు నిధులు సహా ఏ అంశంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని విమర్శించారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో విభజన చట్టంలో ఉన్న 11 కేంద్ర సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చామని... ఇప్పుడు వాటి పురోగతి ఏమిటో కూడా చెప్పలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ వంటి సంస్థకు కూడా నీటి సౌకర్యం ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పోర్టులన్నీ చేతులు మారుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పారు. కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని... ఈ విషయంలో జగన్ స్పృహ లేకుండా ఉన్నారని విమర్శించారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని చంద్రబాబు నాయుడు అన్నారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయని అన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత కుమార్తెతో కూడా ఫోన్ లో మాట్లాడలేకపోతున్నాను అని ఒక వైసీపీ ఎమ్మెల్యేనే చెప్పడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దేశంలో అందరి సీఎంల కంటే ధనికుడైన జగన్....పేదల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ స్కీం పెట్టాడు అంటే అందులో స్కాం ఉంటుందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్స్ అమ్మకాలు, ఇసుక పాలసీలు అందుకు ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఒక్క వర్గం కూడా జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News