Telangana: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కత్తులకు పదునుపెడుతున్న అధికార, విపక్షాలు
- నేటి మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం
- రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై
- రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
- 16న ముగియనున్న సమావేశాలు
తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. మరోవైపు, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేస్తారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఆదివారం సెలవు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. మంగళవారం సభకు సెలవు. ఆ తర్వాతి నుంచి సమావేశాలు కొనసాగుతాయి. 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నూతన సచివాలయాన్ని ప్రారంభించనుండడంతో 16నే సమావేశాలు ముగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కీలకం కానుంది. బడ్జెట్ ను రూ. 3 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.