Assam: బాల్య వివాహాలపై కేసులు.. అసోంలో అరెస్టుల పర్వం

Over 1800 Arrested Across Assam Over Child Marriages
  • 1,800 మందిని అరెస్టు చేశామన్న ముఖ్యమంత్రి  
  • రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కేసులు నమోదైనట్లు వెల్లడి
  • మరికొన్ని రోజులపాటు అరెస్టులు కొనసాగుతాయని ట్వీట్
బాలికలను పెళ్లి చేసుకున్న వారిని అరెస్టు చేస్తామని చెప్పిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నంత పనీ చేశారు. ఇప్పటిదాకా 1,800 మందికి పైగా అరెస్టు చేసినట్లు ఈరోజు ఉదయం వెల్లడించారు. మరికొన్ని రోజులపాటు ఈ అరెస్టులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

‘‘బాల్య వివాహాల నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి వ్యతిరేకంగా చర్యలు కొనసాగుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,800 మందికి పైగా అరెస్టు చేశాం. మహిళలపై హేయమైన, క్షమించరాని చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం’’ అని హిమంత ట్వీట్ చేశారు. 

బాల్య వివాహాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 4 వేల కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని హిమంత బిశ్వ శర్మ గురువారం వెల్లడించారు. ‘‘బాల్య వివాహాలకు ముగింపు పలకాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 3 నుంచి యాక్షన్ మొదలవుతుంది. అందరూ సహకరించాలని కోరుతున్నాం’’ అని నిన్న ట్వీట్ చేశారు.

14 ఏళ్ల లోపు బాలికల్ని పెళ్లి చేసుకునే వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. 14-18 ఏళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Assam
Arrested
Child Marriages
Himanta Biswa Sarma
Assam Chief Minister

More Telugu News