Nara Lokesh: బంగారుపాళ్యంలో సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు... భవనం ఎక్కి ప్రసంగించిన లోకేశ్

Lokesh gives speech from a building after police denied permission
  • బంగారుపాళ్యం చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • సభ ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయం
  • అనుమతి లేదన్న పోలీసులు.. ఉద్రిక్తత
  • త్రివర్ణ పతాకం చేతబూని పాదయాత్ర కొనసాగించిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకుంది. అయితే బంగారుపాళ్యంలో లోకేశ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. లోకేశ్ రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు బంగారుపాళ్యంలో మోహరించారు. లోకేశ్ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో లోకేశ్ ధర్నాకు దిగారు. 

అటు టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలిరావడంతో బంగారుపాళ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ సభకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. లోకేశ్ ప్రసంగం వాహనం అందుబాటులో లేకపోవడంతో, ఓ ఎత్తయిన స్టూల్ వేసుకుని అయినా మాట్లాడాలని లోకేశ్, టీడీపీ నేతలు భావించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ జాతీయ జెండా చేతబూని ఆ తోపులాట మధ్యే పాదయాత్ర కొనసాగించే ప్రయత్నం చేశారు. 

పాదయాత్రకు అనుమతులు ఇచ్చే సమయంలోనే కొన్ని షరతులు విధించామని, ప్రజలతో ముఖాముఖీ తప్ప సభలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎంతకీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో, లోకేశ్ ఓ భవనం మొదటి అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి ప్రసంగించారు. దాంతో, టీడీపీ శ్రేణులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. నిన్న పలమనేరులో పోలీసులు లోకేశ్ వాహనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Nara Lokesh
Yuva Galam Padayatra
Bangarupalem
TDP
Chittoor District
Andhra Pradesh

More Telugu News