Chandrababu: ఈ ప్రభుత్వం సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తోంది: చంద్రబాబు
- చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు
- తమకు అండగా నిలవాలన్న నేతలు
- టీడీపీ ఆవిర్భావం నుంచి ముస్లింలతోనే ఉందన్న చంద్రబాబు
- ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను వేధిస్తోందని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబును నేడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. తమకు అండగా నిలవాలని వారు చంద్రబాబును కోరారు. 70 శాతం వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ముస్లింలను కూడా వేధిస్తోందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలు తీవ్రంగా నష్టపోయారని, ముస్లింలపై 72 దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. వెలుగు చూడని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలిచిందని ఉద్ఘాటించారు.
ముస్లిం వర్గంపై దాడులను ఎదుర్కోవడంలోనూ, వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించుకోవడం కోసం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటం అభినందనీయం అని తెలిపారు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలపైనా దాడులు చేస్తోందని, చివరికి సొంత పార్టీ వారిపైనా దాడులు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని అన్నారు.
జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, జగన్ కు విపక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ లు తప్ప రాష్ట్రం గురించి పట్టడంలేదని వ్యాఖ్యానించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రోడ్డెక్కిన పరిస్థితిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అడుగడుగునా రాజీ పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు సొంత లాబీయింగ్ కోసమే పనిచేస్తారని, రాష్ట్రం కోసం కాదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరవు జిల్లాలకు నిధులు సహా ఏ ఒక్క అంశంలో కూడా కేంద్రంపై వైసీపీ ఒత్తిడి తీసుకురాలేకపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.
కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో సాగునీటి పరంగా రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో సీఎం జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని వివరించారు.
ఇక, వివేకా హత్య వ్యవహారంపైనా చంద్రబాబు స్పందించారు. వివేకా హత్య కేసు నుంచి జగన్ ఇక తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయని వెల్లడించారు. జగన్ ఓ స్కీమ్ పెట్టాడంటే అందులో సొంత స్కామ్ ఉంటుందని... అందుకు జే బ్రాండ్స్ మద్యం, ఇసుక విధానమే ఉదాహరణలని వివరించారు.