Andhra Pradesh: మరోసారి బదిలీ అయిన ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్
- గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ ఆదేశాలు
- ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సింఘాల్
- గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన సీనియర్ అధికారి
సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న సింఘాల్ ను గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిదాకా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రాం ప్రకాష్ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. కాగా, 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు.
దాదాపు మూడేళ్ల పాటు టీటీడీ ఈవోగా పనిచేసిన సింఘాల్ ను తర్వాత ఏపీ ప్రభుత్వం 2020లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అనంతరం దేవాదాయ శాఖకు బదిలీ చేసింది. గతేడాది చివర్లో టీటీడీ ఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో కొన్ని రోజులు పని చేశారు. కుమారుడు చనిపోయిన కారణంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవు తీసుకోవడంతో సింఘాల్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మరోసారి బదిలీ చేయడంతో సింఘాల్ రాజ్ భవన్ లో గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.