Gautam Adani: పది రోజుల్లోనే అదానీ సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి
- హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారీగా నష్టపోతున్న అదానీ గ్రూప్ షేర్లు
- 217 బిలియన్ డాలర్ల విలువ నుంచి 99 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదానీ మార్కెట్ విలువ
- ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానం నుంచి 21వ స్థానానికి అదానీ
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు. అదానీ సంస్థలకు చెందిన స్టాక్స్ అన్నీ స్టాక్ మార్కెట్ లో భారీగా పతనం అవుతున్నాయి. ఈ కారణంగా అదానీ సంపద ఆవిరవుతూనే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు.
అదానీ సంస్థల షేర్లు అన్నీ సగానికి పడిపోయాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కంటే ముందు అదానీ గ్రూప్ 217 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఆ విలువ 99 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దాంతో, మొన్నటిదాకా ఆసియాలో అత్యంత సంపన్నుడిగా వెలుగొందిన అదానీ.. అగ్రస్థానాన్ని కోల్పోయారు. అలాగే, ప్రపంచ సంపన్ననుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఒక్కసారిగా 21వ స్థానానికి పడిపోయారు.