Kotamreddy Sridhar Reddy: సజ్జలా.. నీకు నేరుగా నెల్లూరు రూరల్ నుంచి వీడియో కాల్స్ వస్తాయి: కోటంరెడ్డి వార్నింగ్

Kotamreddy fires on Sajjala and Kakani
  • వైఎస్ విగ్రహం పెట్టకుండా కాకాణి అడ్డుకున్నారన్న కోటంరెడ్డి
  • నెల్లూరు కోర్టులో చోరీ కేసు గురించి చూసుకో అని ఎద్దేవా
  • సజ్జలకు చెందిన వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించాడని మండిపాటు
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. మంత్రులు, సలహాదారులపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. మంత్రి కాకాణిపై వంగ్యాస్త్రాలను విసిరారు. బావా కాకాణి... వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని అన్నారు. వైసీపీలో ఉండకూడదు అని నిర్ణయించుకున్న తర్వాతే తాను టీడీపీ వైపు మళ్లానని చెప్పారు. తాను వైసీపీకి విధేయుడిని కాదు, వేరే వాళ్లకు విధేయుడినని కాకాణి అన్నారని... అవును, తాను ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానని, పక్కదారులు చూడనని అన్నారు. 

మిమ్మల్ని జెడ్పీ ఛైర్మన్ చేసి రాజకీయాల్లో మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టకుండా గతంలో మీరు అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు. తనను తిడితే వైసీపీలో పదవులు వస్తాయనుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా? అని ప్రశ్నించారు. నెల్లురు కోర్టులో దస్త్రాల చోరీ కేసులో అన్ని వేళ్లు నీవైపే చూపిస్తున్నాయని... ముందు ఆ కేసు సంగతి చూసుకో అని ఎద్దేవా చేశారు. 

ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కోటంరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. నిన్న బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించాడని.. కొట్టుకుంటూ తీసుకెళ్తానన్నాడని... ఆ వ్యక్తి ఎవరని ఆరా తీస్తే సజ్జల కోటరీ అని తేలిందని చెప్పారు. సజ్జలా... నాకు ఇలాంటి కాల్స్ చేయిస్తే, నీకు నెల్లూరు రూరల్ నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరించారు. సజ్జల, బోరుబడ్డ అనిల్ లాంటి వ్యక్తులకు బెదిరే రకం తాను కాదని చెప్పారు. 

మరోవైపు నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ భాస్కరెడ్డిని కిడ్నాప్ చేశారంటూ కోటంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోటంరెడ్డి స్పందిస్తూ... రెండు రోజుల క్రితం తన వెంటే ఉంటానని చెప్పాడని... నిన్న కారు దగ్గరకు వచ్చి, బాధగా ఉందని హత్తుకుని ఏడ్చాడని... గంట తర్వాత కిడ్నాప్ కేసులు పెట్టారని విమర్శించారు.
Kotamreddy Sridhar Reddy
Sajjala Ramakrishna Reddy
Kakani Govardhan Reddy
YSRCP

More Telugu News