Pakistan: వికీపీడియా సర్వీసులను బ్లాక్ చేసిన పాకిస్థాన్

Pakistan blocks Wikipedia over failure to remove blasphemous content
  • ‘దైవ దూషణ’పై కంటెంట్ ను తొలగించలేదని వికీపీడియాపై చర్యలు తీసుకున్న పాక్
  • ముందుగా 48 గంటల గడువు ఇచ్చినట్లు వెల్లడి
  • తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే వికీపీడియా విస్మరించిందని విమర్శ
తమ దేశంలో వికీపీడియా సర్వీసులను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. దైవ దూషణకు సంబంధించిన కంటెంట్ ను తొలగించలేదన్న కారణంతో చర్యలు తీసుకుంది. ‘‘దైవ దూషణకు సంబంధించిన కంటెంట్లను తొలగించాలని లేదా బ్లాక్ చేయాలని వికీపీడియాను సంప్రదించాం. గతంలోనే ఫిర్యాదు చేశాం. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం’’ అని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఓ ప్రకటనలో తెలిపింది.

తాము కోరినట్లుగా కంటెంట్ ను వికీపీడియా తొలగించలేదని, అధికారుల ముందు వివరణ ఇచ్చేందుకు హాజరుకాలేదని చెప్పింది. ‘‘దైవదూషణకు సంబంధించిన కంటెంట్ ను తొలగించకపోవడంతో ఫిబ్రవరి 1న వికీపీడియా సర్వీసులను 48 గంటలపాటు ‘డీగ్రేడ్’ చేశాం. మా ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే వికీపీడియా విస్మరించింది’’ అని పీటీఏ ట్వీట్ చేసింది.

48 గంటల గడువు కూడా ముగియడంతో వికీపీడియా సర్వీసులను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించిన తర్వాత వికీపీడియా సర్వీసుల పునరుద్ధరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పీటీఏ చెప్పింది.  

అయితే వికీపీడీయా నుంచి తొలగించాలని కోరిన కంటెంట్ ఏంటనే విషయాన్ని మాత్రం పీటీఏ వెల్లడించలేదు. మరోవైపు ‘సెన్సార్ షిప్ ఆఫ్ వికీపీడియా’ అనే వ్యాసాన్ని వికీపీడియా ప్రచురించింది. అందులో వికీపీడియాపై నిషేధం విధించిన చైనా, ఇరాన్, మయన్మార్, రష్యా, సైదీ అరేబియా, సిరియా, టునీషియా, టర్కీ, ఉజ్బెకిస్థాన్, వెనెజులా వంటి దేశాలను ప్రస్తావించింది.
Pakistan
Wikipedia
blasphemous content
ban on Wikipedia

More Telugu News