Warangal: నమ్మినవారు ముంచేశారంటూ.. వరంగల్‌లో బీజేపీ నేత ఆత్మహత్య!

Warangal BJP Leader Committed Suicide
  • ఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్న కుమారస్వామి
  • టీఆర్ఎస్ నుంచి కార్పొరేట్ టికెట్ దక్కకపోవడంతో బీజేపీలోకి
  • ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలమైన వైనం
  • ఖర్చుల కోసం మాజీ సర్పంచ్ నుంచి రూ. 25 లక్షల అప్పు
  • సెల్ఫీ వీడియోను అందరికీ పంపి ఉరి వేసుకున్న నేత
నమ్మినవారు మోసం చేయడం, అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు భరించలేక వరంగల్ జిల్లా ఎనుమాముల బాలాజీ నగర్‌కు చెందిన బీజేపీ నేత గంధం కుమారస్వామి (45) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూనే టీఆర్ఎస్‌లో కొనసాగేవారు. వరంగల్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగాలని భావించారు. 

అయితే, టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడి బీజేపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుంచి రూ. 25 లక్షల అప్పు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బుల కోసం ఆయన ఒత్తిడి చేస్తుండడంతో తట్టుకోలేని కుమారస్వామి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఓటమి బాధ తనను తీవ్రంగా వేధిస్తుంటే, మరోవైపు డబ్బుల కోసం మాజీ సర్పంచ్ వేధింపులు ఎక్కువయ్యాయని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. నమ్మిన వారు తనను మోసం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్య, పిల్లలను వేధించవద్దని అందులో వేడుకున్నారు. 

అనంతరం ఆ వీడియోను మిత్రులు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య వేరే గదిలో ఉన్నారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త ఆత్మహత్యకు సాంబేశ్వర్, ఆయన భార్య ప్రమీల, కోట విజయ్ కుమార్ కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కుమారస్వామి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Warangal
Enumamula
TRS
BJP

More Telugu News