Turkey: నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన టర్కీ.. 15 మంది మృతి
- 7.8, 6.7 తీవ్రతతో రెండు భూకంపాలు
- భవనాలు నేలమట్టం
- శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రజల హాహాకారాలు
- కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
దక్షిణ టర్కీలో ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపం పెను విషాదం నింపింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా ఉన్నాయి.
సిరియా, యెమెన్‌లోనూ భారీ ప్రకంపనలు కనిపించాయి. ఉత్తర సిరియాలోనూ పలు భవనాలు కుప్పకూలినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున దక్షిణ టర్కీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు తెలిపింది.
గజియాంటెప్ ప్రావిన్స్‌లోని నుదర్గికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూమికి 17.9 కిలోమీటర్ల లోతున తొలి భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే సెంట్రల్ టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతున రెండో భూకంపం సంభవించినట్టు వివరించారు. భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలాయని, శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.